భారత్‌ ఆల్‌రౌండ్‌ షో
28-04-2025 08:18:50
2: SPORTS

OFM , Publish Date - Apr 28 , 2025 | 02:47 AM

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత మహిళలు ముక్కోణపు వన్డే టోర్నీలో ఘనమైన బోణీ కొట్టారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో శ్రీలంకను చిత్తు చేశారు. అంతర్జాతీయ అరంగేట్రం...

ముక్కోణపు వన్డే సిరీ్‌సలో బోణీ

9 వికెట్లతో శ్రీలంక చిత్తు

కొలంబో: ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత మహిళలు ముక్కోణపు వన్డే టోర్నీలో ఘనమైన బోణీ కొట్టారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో శ్రీలంకను చిత్తు చేశారు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తెలుగు స్పిన్నర్‌ శ్రీచరణి (2/26) రెండు వికెట్లతో సత్తా చాటింది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 38.1 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. హాసినీ పెరీరా (30), కవిషా దిల్హరి (25), అనుష్క సంజీవని (22) ఫర్వాలేదనిపించారు. స్నేహ్‌ రాణా మూడు, దీప్తీ శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో టాపార్డర్‌ విజృంభించడంతో భారత్‌ కేవలం 29.4 ఓవర్లలో 149/1 స్కోరు చేసి సునాయాసంగా నెగ్గింది. ఓపెనర్లు ప్రతికా రావల్‌ (50 నాటౌట్‌), మంధాన (43), హర్లీన్‌ డియోల్‌ (48 నాటౌట్‌) రాణించారు. ప్రతిక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. భారత్‌ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.

ఛేదన సునాయాసంగా..: స్వల్ప స్కోరు ఛేదనలో ఓపెనర్లు ప్రతిక, మంధాన అద్భుత ఆరంభం ఇచ్చారు. ఏడో వన్డే మాత్రమే ఆడుతున్న ప్రతిక రెండు కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. మంధానాతో కలిసి తొలి వికెట్‌కు 54, అనంతరం హర్లీన్‌ డియోల్‌తో కలిసి రెండో వికెట్‌కు అభేద్యంగా 95 రన్స్‌ జత చేసింది. ఈక్రమంలో వన్డేలలో వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీని ప్రతిక నమోదు చేసింది.

బౌలర్లు భళా: అంతకుముందు భారత స్పిన్నర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు పరుగులు చేయడం కష్టమైంది. వన్డే అరంగేట్రం చేసిన పేసర్‌ కష్వీ గౌతమ్‌ వికెట్‌ సాధించకపోయినా పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. భారీ వర్షంతో మ్యాచ్‌ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కాగా..పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకున్న భారత బౌలర్లు ప్రత్యర్థిని పరుగులు చేయకుండా నిరోధించారు.

సంక్షిప్తస్కోర్లు:

శ్రీలంక: 38.1 ఓవర్లలో 147 ఆలౌట్‌ (హాసినీ పెరీరా 30, కవిషా దిల్హరి 25, అనుష్క సంజీవని 22, స్నేహ్‌ రాణా 3/31, దీప్తీశర్మ 2/22, శ్రీచరణి 2/26); భారత్‌: 29.4 ఓవర్లలో 149/1 (ప్రతికా రావల్‌ 50 నాటౌట్‌, హర్లీన్‌ డియోల్‌ 48 నాటౌట్‌, మంధాన 43, ఇనోకా రణవీర 1/32).

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

**** ONGOLE FIRST MEDIA ****