2: ANDHRA-PRADESH
OFM
, Publish Date - Apr 28 , 2025 | 12:43 AM
జ్ఞానాపురంలోని పూతసేరు చర్చిలో విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన ఈదల పూర్ణచంద్రిక (11) మృతిపై అనుమానాలు తొలగకుండానే బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. అసలు బాలిక ఎలా మృతిచెందిందో తేలకముందే వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఏం జరిగిందో నిగ్గుతేల్చే పనిలో పోలీసులు పడ్డారు.
ఏం జరిగిందో పోలీసులకూ స్పష్టత కరవు
తాజాగా శ్రీకాకుళంలో బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య
వారి మానసిక పరిస్థితి బాగాలేదేనే అభిప్రాయాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 27 (OFM):
జ్ఞానాపురంలోని పునీత పేతురు చర్చిలో విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన ఈదల పూర్ణచంద్రిక (11) మృతిపై అనుమానాలు తొలగకుండానే బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. అసలు బాలిక ఎలా మృతిచెందిందో తేలకముందే వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఏం జరిగిందో నిగ్గుతేల్చే పనిలో పోలీసులు పడ్డారు.
శ్రీకాకుళం మండలం గూడెం గ్రామానికి చెందిన మోది సావిత్రమ్మ తన కుమార్తె వరలక్ష్మితో కలిసి 15 ఏళ్ల కిందటే డెంకాడకు వలస వెళ్లిపోయింది. 12 ఏళ్ల కిందట వరలక్ష్మికి ఈదల శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహమయింది. వారికి పూర్ణచంద్రిక జన్మించింది. దంపతుల మధ్య వివాదాల కారణంగా వరలక్ష్మి తన కుమార్తెతో కలిసి తల్లి సావిత్రమ్మ వద్ద ఉంటోంది.
ఈ క్రమంలో కొంతకాలంగా చంద్రికకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రార్థన చేస్తే తగ్గిపోతుందనే భావనతో పలు చర్చిలకు తిప్పుతున్నారు. ఇటీవల కొత్తవలసలోని చర్చికి తీసుకు వెళ్లి ప్రార్థన చేయగా ఫలితం కనిపించకపోవడంతో, ఈనెల 24న జ్ఞానాపురంలోని చర్చికి తీసుకువెళ్లారు. అక్కడ పాస్టర్ వినయ్ ఆమె పేరిట ప్రార్థన చేశారు. అనంతరం తిరిగి వెళ్లకుండా ముగ్గురూ అక్కడే ఉండిపోయారు. తర్వాత వారంతా మరోసారి ప్రార్థన చేస్తుండగా చంద్రిక గట్టిగా అరుస్తూ అక్కడివారిని కరిచేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, ముఖానికి చున్నీ చుట్టేశారు. అయితే చంద్రిక అచేతనంగా పడివుండడం, ముఖానికి గుడ్డ కట్టివుండడంతో అక్కడివారు చర్చి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ప్రార్థన అయిపోయింది కాబట్టి వెళ్లిపోవాలని వరలక్ష్మి, సావిత్రమ్మను కోరారు. దీంతో చంద్రిక ముఖానికి కట్టిన చున్నీని విప్పిన తల్లి, అమ్మమ్మ ఆమెలో స్పందనలేకపోవడంతో మృతిచెందినట్టు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదుచేశారు. అయితే తన కుమార్తె మృతికి భార్య, అత్త కారణమని తండ్రి శ్రీనివాసరావు ఆరోపించడంతో వారిద్దరూ శనివారం రాత్రి శ్రీకాకుళంలోని తమ స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ చున్నీని మెడకు బిగించుకుని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బాలిక మృతిపై అనుమానాలు తొలగకముందే వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఈ కేసుపై మరింత దృష్టిసారించారు. బాలికతోపాటు ఆమె తల్లి, అమ్మమ్మ మానసిక పరిస్థితి బాగోలేదని, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారని స్థానికులు తెలిపారని పోలీసులు చెబుతున్నారు.